జో బైడెన్ బీస్ట్ కారు ప్రత్యేకతలేంటో తెలుసా?
ఢిల్లీ రోడ్లపై బీస్ట్ కారు - అమెరికా అధ్యక్షుడి కారా మజాకా
స్పెషల్ రిపోర్ట్- ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ సదస్సు జీ20 (G20) ఈ సారి మన భారత్ లో జరుగుతోంది. 20 దేశాలకు చెందిన అధినేతలు పాల్గొనే ఈ సదస్సులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ అందించే భద్రతతో పాటు ఆయా దేశాల అధినేతలు సొంతంగా తమ సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానందా చెప్పుకోవాల్సింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) సెక్యురిటీ. బైడెన్ భద్రతనే కాదు ఆయన ప్రయాణించే వాహనాలు సైతం అమెరికా నుంచి ఢిల్లీకి రానున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు జో బైెడెన్ ప్రయాణించే ది బీస్ట్ (The Beast) కారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలువనుంది.
జీ20 (G20) శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలో సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశాధినేతలు మధ్య సమావేశం జరుగుతుంది. దీనిలో భాగంగా బైడెన్ (Joe Biden) సెప్టెంబర్ 7వ తేదీనే భారత్ కు విచ్చేస్తున్నారు. 8న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారు. బైడెన్ ప్రయాణం కోసం ఆకాశంలో ప్రయాణానికి ఎయిర్ ఫోర్స్ వన్‌తో పాటు హెలికాప్టర్లను వినియోగించనున్నారు. రోడ్డు ప్రయాణానికి ఉపయోగించే కాన్వాయ్ లో ది బీస్ట్ కారు ప్రత్యేకం. అమెరికా ప్రెసిడెంట్ ఉపయోగించే ది బీస్ట్ ను కాడిలాక్ వన్ (Cadillac One), ఫస్ట్ కార్ అని కూడా పిలుస్తుంటారు. 1963 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత అధ్యక్షుడి కారును మరింత భద్రంగా తీర్చిదిద్దాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకోసం 1.5 మిలియన్ల డాలర్లపైనే ఖర్చుపెట్టి ప్రస్తుతం వినియోగిస్తున్న సరికొత్త కాడిలాక్ మోడల్ ను 2018 లో అధ్యక్షుడి కాన్వాయ్ లోకి ప్రవేశపెట్టారు. అత్యంత అధునాతన ఫీచర్లతో, భారీ భద్రతా ప్రమాణాలతో ఈ కారును రూపొందించారు. అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనకు ఎక్కడికి వెళ్లినా అక్కడికి బీస్ట్ (The Beast) కార్ కూడా వెళ్తుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రయాణించే బీస్ట్ (The Beast) కారు అద్దాలు ఐదు అంగుళాల మందంతో, డోర్లు 8 అంగుళాల మందంతో ఉంటాయి. గాజు, పాలీకార్బొనేట్ తో ఐదు లేయర్లలో అద్దాలను తయారు చేశారు. కేవలం డ్రైవర్ విండోను మాత్రం 3 అంగుళాల మేర తెరుచుకుంటుంది. మిగతా అద్దాలేవీ అస్సలు తెరుచుకోవు. కారు అద్దాలన్నీ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ తో పాటు రసాయన, జీవాయుధ దాడులను కూడా ఇవి సమర్ధవంతంగా తట్టుకుంటాయి.
ఇక బీస్ట్ (The Beast) కారు టైర్లు కూడా అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. ఈ టార్లు పగిలిపోవు, అస్సలు పంక్చర్ కావు. ఒకవేళ డ్యామేజ్ అయినా లోపల ఉండే స్టీల్ రీమ్ లతో అంతే స్పీడ్ తో ప్రయాణించవచ్చు. స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్ తో తయారు చేసిన ఈ కారు బాంబు దాడులను కూడా తట్టుకునేలా తయారు చేశారు. ప్రమాదకర, అత్యవసర సమయాల్లో అవసరమయ్యే పానిక్ బటన్ తో పాటు ఆక్సిజన్ సరఫరా ఏర్పాటు సైతం బీస్ట్ కారులో ఉంది. అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ సంబంధించిన బ్లడ్ బ్యాగ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఏదైనా ఢీకొట్టిన పేలకుండా ఉండేలా తయారు చేశారు.
బీస్ట్ (The Beast) కారును ఇక అల్లాటప్పా డ్రైవర్లు నడపడం కుదరదు. బీస్ట్ డ్రైవర్ కు అమెరికా సీక్రెట్ సర్వీస్ తో ముందుగానే ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. ఎమర్జెన్సీ టైంలో అధ్యక్షుడిని ఎలా కాపాడాలనే దానిపై శిక్షణ ఇస్తారు. అంతే కాదు డ్రైవర్‌కు ప్రతి రోజు వైద్య పరీక్షలు చేస్తారు. అధ్యక్షుడి సీట్ దగ్గర ఏర్పాటు చేసిన శాటిలైట్ ఫోన్ ద్వారా నేరుగా వైట్ హౌజ్, వైస్ ప్రెసిడెంట్, పెంటగాన్ కు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. అన్నట్లు బీస్ట్ అంటే నాలుగు కాళ్లతో నడిచే అత్యంత ప్రమాదకర మృగం అని అర్థం. ఇక జో బైడెన్ భద్రతా చర్యల్లో భాగంగా భారత్ కు 75 నుంచి 80 వాహనాలు తీసుకువస్తామని అమెరికా ప్రతిపాదించగా, చర్చల తరువాత ఆ సంఖ్యను 60 కి కుదించినట్లు తెలుస్తోంది. దిల్లీలోని ఐటీసీ మౌర్య షెరాటన్ లోని 14వ ఫ్లోర్ లో బైడెన్ (Joe Biden) బసచేయనున్నారు.