OLA

అవునా.. ఓలా నుంచి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

బిజినెస్ రిపోర్ట్- ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓలా మరో సరికొత్త ఆవిష్కరణతో ముందుకొస్తోందని తెలుస్తోంది. ఓలా సోలో (Ola solo) పేరుతో ప్రపంచంలోనే తొలి అటానమస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఓలా. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ అటానమస్ స్కూటర్‌ పని చేస్తుందని ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ చెప్పారు. దీనికి సంబంధించిన ఓ ప్రత్యేకమైన వీడియోను ఏప్రిల్‌ 1 విడుదల చేశారు.

ఏప్రిల్‌ 1న సరదాగా అందరిని ఫూల్ చేయడానికి ఓలా వీడియోను విడుదల చేసిందని చాలామంది అనుకున్నారు. దీనిపై ఏప్రీల్ 2న మంగళవారం ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్‌ మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతకు ముందు రోజు పోస్ట్ చేసిన వీడియోను చాలా మంది ఏప్రిల్‌ ఫూల్స్ జోక్‌ అని భావించారన్నారని ఆయన కామెంట్ చేశారు. వాస్తవానికి వీడియోను సరదా కోసమే రూపొందించినా కూడా.. అటానమస్ టెక్నాలజీపై తమ బృందం పని చేస్తోందని భవీశ్‌ స్పష్టం చేశారు.

టూవీలర్‌ లో కూడా అటానమస్‌, సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందని భవీశ్‌ అగర్వాల్ తెలిపారు. రానున్న రోజుల్లో ఓలా కంపెనీ నుంచి ఇలాంటి టెక్నాలజీని చూడొచ్చని భవీశ్‌ చెప్పుకొచ్చారు. అన్నట్లు ఓలాకు సంబందించిన ఈ ప్రత్యేక వీడియోను ట్వీట్టర్ లో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే 4 లక్షల మంది వీక్షించారు.


Comment As:

Comment (0)