CM Jagan Bail

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్‌

ఏపీ సీఎం వైఎస్ జగన్‌, సీబీఐలకు సుప్రీం నోటీసులు

ఢిల్లీ రిపోర్ట్- ఏపీ సీఎం వైఎస్ జగన్‌ (CM Jagan) బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్‌ మోహనై రెడ్డి, సీబీఐ సహా ఈ కేసుకు సంబందించిన ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు ఇచ్చింది. గత పది సంవత్సరాలుగా సీఎం జగన్‌ బెయిల్‌పై ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ లో ఆయన అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు ప్రభావితం చేస్తున్నారని, అందుకని వెంటనే ఆయన బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీఎం జగన్ సాక్ష్యాలు చెరిపేస్తున్నారనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా.. అని ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై లిఖితపూర్వకంగా వివరాలను రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు అందించారు.

జగన్‌ కు బెయిల్‌ మంజూరు చేసిన తరువాత దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయ స్థానంలో సవాలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు రఘురామ తరపు న్యాయవాది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం సీఎం జగన్ బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా.. అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి ఆ తరువాత ప్రక్రియ చేపట్టాలని రఘురామకృష్ణ రాజు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. జగన్ అక్రమాస్తుల కేసును హైదరాబాద్‌ నుంచి దిల్లీకి మార్చాలని ఇప్పటికే విచారణను రఘురామకృష్ణ రాజు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆ పిటిషన్‌ ను సైతం జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది ధర్మాసనం. ఈ కేసుకు సంబందించిన తదుపరి విచారణ వచ్చే సంవత్సరం 2024 జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. CM Jagan Bail Petition 


Comment As:

Comment (0)