Woman Reservation Bill Passed

మహిళా బిల్లును పార్టీలకతీతంగా సమర్థించిన ఎంపీలు

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభలో ఏకగ్రీవ ఆమోదం

ఢిల్లీ రిపోర్ట్- చారిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women Reservation Bill) రాజ్యసభ ఆమోదం పొందింది. పార్టీలకు అతీతంగా మహిళా బిల్లుపై సభ్యులంతా స్పందించారు. రాజ్యసభలో దాదాపు 11 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఓటింగ్‌ లో మహిళఆ రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా 214 మంది సభ్యులు ఓటేశారు. వ్యతిరేకంగా ఎవరూ ఓటు వేయలేదు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు పలికినా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఓటింగ్‌ నిర్వహించారు. బిల్లు 2/3 వంతు సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లు ఓటింగ్‌ అనంతరం రాజ్య సభ చైర్మెన్ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు. ఆ తర్వాత సభను ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా వేశారు. 

అంతకు ముందే లోక్‌ సభ సైతం నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఓటింగ్‌ సమయంలో ప్రధాని మోదీ (PM Modi) సభలోనే ఉన్నారు. బిల్లు ఆమోదం పట్ల ఆయన సంతోషంగా కనిపించారు. చర్చలో కొంత మంది ప్రతిపక్ష సభ్యులు ఇది ఎన్నికల స్టంట్ అని అభివర్ణించినా చివరకు ఓటింగ్‌ లో మద్దతుగా తెలిపారు. లోక్‌ సభలో బుధవారం ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల 128వ రాజ్యాంగ సవరణ బిల్లును గురువారం కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాక చట్టంగా మారితే 2024 ఎన్నికల తర్వాత జన గణన, డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత చట్టం అమల్లోకి రానుంది. మహిళా రిజర్వేషన్లు 2029 తర్వాతే అమల్లోకి రానున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. 
 


Comment As:

Comment (0)