కొలెస్ట్రాల్ తగ్గించే ఆహార, వ్యాయామ నియమాలు ఏంటి
రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుంచుకునే మార్గాలేమిటి
హెల్త్ రిపోర్ట్- మనం ఏ మాత్రం బరువు పెరిగినా రక్తంలో కొలెస్ట్రాల్ (Blood Cholesterol) కూడా పెరుగుతుంది. అందుకే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం 150 నిమిషాల సేపు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఏరోబిక్, నడక, పరుగు, సైకిల్ తొక్కటం వంటివి చేయాలని చెబుతున్నారు.
ఇక రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే నూనె వాడకం తగ్గించుకోవాలి. ఒకరికి నెలకు అరలీటరు నూనే కన్నా మించకుండా చూసుకోవాలి. కుటుంబంలో నలుగురుంటే నెలకు 2 లీటర్ల కన్నా ఎక్కువ నూనె వాడకుండా జాగ్రత్త పడాలి.
ఇక కొలెస్ట్రాల్ పెరగవద్దంటే చిరుతిళ్లు మానెయ్యాలి. వనస్పతి వంటి ట్రాన్స్ ఫ్యాట్స్ కు దూరంగా ఉండాలి.
నీటిలో కరిగే పీచుతో కూడిన పదార్థాలు, బార్లీ, అవిసె గింజలు, పచ్చి బఠానీల వంటి పప్పులు, బీన్స్, ఎండు అంజీరా, ఖర్జూరం, బ్రోకలీ, క్యాబేజీ, చిలగడ దుంప, బత్తాయి, యాపిల్, క్యారెట్, మొక్కజొన్న వంటివి రెగ్యులర్ గా తినాలి.
వీటితో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వారానికి కనీసం మూడు సార్లయినా యోగా, ధ్యానం చేయటం మంచిదని చెబుతున్నారు.
ఇక పొగ అలవాటు ఉంటే వెంటనే మానెయ్యాలి. పొగ మానేస్తే మంచి కొవ్వు మోతాదులు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఏదేమైనా కొలెస్ట్రాల్ (blood cholesterol) విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.