KTR 1 BRS

సీఎం రేవంత్‌రెడ్డి బూతులు ప్రవచనాల్లా ఉన్నాయా- కేటీఆర్ 

బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్‌ పనిచేస్తోంది- కేటీఆర్

హైదరాబాద్ రిపోర్ట్- కేంద్ర ఎన్నికల సంఘంపై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్‌ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్‌షా దారుణంగా వ్యాఖ్యలు చేసి విద్వేషాలు సృష్టిస్తుంటే వారిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్‌ గురువారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో, నగరంలోని మూసాపేట, శ్రీరామ్‌నగర్‌ రోడ్‌షోలలో మాట్లాడారు. బీజేపీ సోషల్ మీడియా వేదికగా ముస్లింలపై నేరుగా విషం చిమ్ముతూ పోస్టులు పెడుతున్నా, ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటారని మోదీ ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసినా ఎన్నికల కమీషన్ పట్టించుకోవడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా దేవుడి ఫొటో పెట్టుకొని ప్రచారం చేసినా, బీజేపీ అధికారిక ట్విట్టర్ ఎక్స్‌ అకౌంట్ లో రాముడి ఫొటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. మోదీ, అమిత్ షా వ్యాఖ్యలపై సుమారు 20 వేల ఫిర్యాదులు వచ్చినా కనీసం మోదీకి నోటీసులు ఇవ్వడానికి కూడా ఎన్నికల సంఘం భయపడుతోందని అన్నారు. కేవలం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసులు ఇచ్చి సరిపెట్టిందని కేటీఆర్‌ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రచారంపై మాత్రం 48 గంటలపాటు నిషేధం విధించేందిందని ఎన్నికల కమీషన్ పై ఫైర్ అయ్యారు కేటీఆర్.


Comment As:

Comment (0)