వివాదాస్పదంగా అల్లు అర్జున్ నంద్యాల పర్యటన
సినీనటుడు అల్లు అర్జున్ పై పోలీసు కేసు
నంద్యాల రిపోర్ట్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాల పర్యటన వివాదాస్పదంగా మారింది. అల్లు అర్జున్ శనివారం నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఐతే ఆయన పర్యటనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతి తీసుకోలేదు. లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో వైసీపీ కార్యకర్తలు నంద్యాల శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీగా అల్లు అర్జున్ ను సిటీలోకి తీసుకువచ్చారు.
అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండగా ఇంచుమించు అదే టైంలో హీరో అర్జున్ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో చంద్రబాబు పర్యటనకు ముందస్తు అనుమతి తీసుకున్న సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో ఎలా పర్యటిస్తారని నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండీ.ఫరూక్ ప్రశ్నించారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని సినీనటుడు అల్లుఅర్జున్, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిలపై శనివారం టుటౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎన్నికల అధికారి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలో 30 పోలీసు యాక్టు, 114 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో ఎన్నికల అధికారి అనుమతి లేకుండా శిల్పా చంద్రకిశోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ రావజం, అక్కడ వేలాది మంది గుమిగూడటం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని పోలీసులు చెబుతున్నారు. అల్లు అర్జున్ పర్యటనలో జనసేన జెండాలు కనిపించడం ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ పర్యటనలో కొంత మంది పవన్‌కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.