తిరుమల కొండపై భక్తజన ప్రవాహం.. 3 కి.మీ మేర క్యూలైను
తిరుమల తిరుపతి రిపోర్ట్- కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల(Tirumala)కు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల దృష్ట్యా ఏడుకొండలపై భక్తుల కోలాహలం నెలకొంది. ఒక్కసారిగా పెరిగిన రద్దీతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెెలిపింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తులతో నిండిపోయాయి. తిరుమలలో ఔటర్ రింగురోడ్డులో 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సాధారణ సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది.
క్యూలైన్ లలో వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది తాగునీరు, పాలు, అల్పాహారం అందిస్తున్నారు. ఇక తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం జోరు వాన కురిసింది. దీంతో శ్రీవారి ప్రధానం ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలు తడిసిముద్దయింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం తరువాత లడ్డూ విక్రయ కేంద్రాలు, గదులకు వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. తిరునల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక షెడ్ల దగ్గర భక్తులు తలదాచుకున్నారు. సుమారు రెండు గంటల పాటు వర్షం కురవడంతో తిరుమల కొండల్లో వాతావరణం అహ్లాదకరంగా మారింది.