Telangana Polling

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో 51.61 శాతం 

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 66.30 శాతం పోలింగ్

హైదరాబాద్ రిపోర్ట్- నాల్గవ విడత లోక్ సభ పోలింగ్ (Loksabha Election 2024) లో భాగంగా తెలంగాణలో సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66.30 శాతం పోలింగ్‌ నమోదైంది. తెలంగాణ ఓటర్లు చూపిన ఉత్సాహంతో 2019 లోక్‌సభ ఎన్నికలను మించి పోలింగ్ శాతం నమోదైంది. మంగళవారానికి ఎన్నికల సంఘం ఫైనల్ పోలింగ్ శాతాన్ని వెల్లడించాక పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో అక్కడక్కడా చెదురు మదురు సంఘటనలు మినహా లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో పోలింగ్‌ కొంత తక్కువగా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 71.34 శాతం పోలింగ్ నమోదైతే.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో 66.30 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగో విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్‌ జరిగింది. మరోవైపు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబందించిన పోలింగ్ సైతం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలైంది.

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగిసింది. మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సమయం ముగిసే సమయానికి క్యూ లైన్లలో నిలబడిన వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది ఎన్నికల సంఘం. అత్యధికంగా భువనగిరిలో పార్లమెంట్ సెగ్మెంట్ లో 76.78 శాతం పోలింగ్ నమోదవ్వగా, అత్యల్పంగా హైదరాబాద్‌ లోక్ సభ స్థానంలో 48.48 పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో 51.61 శాతం పోలింగ్‌ నమోదైందని ఈసీ తెలిపింది.

 


Comment As:

Comment (0)