సిద్దరామయ్య సర్కార్ పై జేడీఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు - కర్ణాటక ప్రభుత్వం కూలిపోవచ్చు
నేషనల్ రిపోర్ట్- కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ (JDS) అగ్రనేత కుమార స్వామి (Kumaraswamy) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రాష్ట్రంలోని సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రభుత్వం కూలిపోవచ్చని కుమార స్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక మంత్రి త్వరలోనే బీజేపీ పార్టీలో చేరవచ్చని కుమార స్వామి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసుల నుంచి బయటపడేందుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. అంతే కాదు ఆ మంత్రితో పాటు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరతారని ఆయన చెప్పారు. వారంతా ప్రస్తుతం బీజేపీతో చర్చలు జరుపుతున్నారని కుమార స్వామి తెలిపారు.
ఆదివారం హాసన్ లో పర్యటించిన కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సవ్యాంగా ఏమీ లేదని, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో తెలియదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ లోని ఏ మంత్రి తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు కుమార స్వామి. సదరు మంత్రి ఎవరో చెప్పాలంటూ మీడియా ప్రశ్నించగా.. సమాధానం దాటేశారు. మహారాష్ట్ర మాదిరిగానే కర్ణాటకలో ఏ క్షణమైనా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందని కుమార స్వామి వ్యాఖ్యానించడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.