పాలమూరు-రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పాలమూరు-రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

న్యూ ఢిల్లీ-హైదరాబాద్-నాగర్ కర్నూల్- తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి (Palamuru Rangareddy Lift Irrigation) కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతి లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణపనులు వేగంగా చేపట్టేందుకు మాలైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల పధకం నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కమిటీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని పర్యావరణ అనుమతుల కమిటీ (Environmental Affairs Committee) (EAC) గత నెల 24వ తేదీన నిర్వహించిన 49వ సమావేశం మినిట్స్‌ను గురువారం విడుదల చేసింది.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో పర్యావరణపరమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని, దానికి సంబంధించి ఉపశమన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అథారిటీని ఈఏసీ ఆదేశించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 12.38 లక్షల ఎకరాలకు సాగునీరు, వేల గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2016లో తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పధకం నిర్మాణం చేపట్టింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాచర్ నుంచి రోజుకు 1.5 టీఎంసీ చొప్పున అరవై రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేందుకు ఈ పనులు మొదలుపెట్టింది.  మొత్తం 4 లిఫ్టులు, అయిదు రిజర్వాయర్లు ఉన్నాయి.

ఇప్పటికే నార్లాపూర్‌ రిజర్వాయర్ 89.44 శాతం, ఏదుల రిజర్వాయర్ 90 శఆతం, వట్టెం రిజర్వార్ 70 శాతం, కరివెన రిజర్వాయర్ 60 శాతం, ఉదండాపూర్‌ రిజర్వాయర్ 48 శాతం పనులు పూర్తయ్యాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణమ్మ నీటితో పాలమూరు పాదాలు కడిగే రోజు ఆసన్నమైందని సీఎం అన్నారు. ఎన్నో కేసులు, అడ్డంకులను ఎదుర్కొని, అకుంఠిత దీక్షతో ఈ అనుమతులను సాధించామని చెప్పారు. ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయంగా కేసీఆర్ అభివర్ణించారు.