తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి- రంగంలోకి కేంద్ర ప్రభుత్వం
తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Laddu) తయారీకి కల్తీ నెయ్యి విషయంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన చెన్నైకి చెందిన ఏఆర్ ఫుడ్స్ (AR Foods) కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం (FSSAI) నోటీసులు జారీ చేసింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన మొత్తం నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను సేకరించిన కేంద్ర ప్రభుత్వం.. నాణ్యత పరీక్షలో ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి చెందిన నెయ్యి విఫలమైనట్లు పేర్కొంది. ఈ మేరకు ఏఆర్ ఫుడ్స్ సంస్థకు నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏఆర్ ఫుడ్స్‌తో పాటు మరికొన్ని సంస్థలకు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులపై ఆయా సంస్థల సమాధానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నివేదిక మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆహార భద్రత ప్రమాణాల విభాగం స్పష్టం చేసింది. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సుప్రీం కోర్టులో పలువురు కేసులు దాఖలు చేస్తున్నారు.