cm revnath ts

తొమ్మిది నెలల్లో ఒక్క రోజు సెలవు తీసుకోలేదు-సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా తన ఆధ్వర్యంలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని సీట్లు గెలిచామని చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి ధన్యవాదాలు తెలుపుతు సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేస్తోందని తెలిపారు. పార్టీ నాయకత్వం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పుకొచ్చారు. ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని పీసీసీకి సూచించారు రేవంత్ రెడ్డి. పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 36 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని గుర్తు చేసిన సీఎం.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసినందుకే వారికి పదవులు ఇచ్చామని చెప్పారు. 

పార్టీ లో కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉన్న సమయంలో పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ బాధ్యత చేపట్టారని చెప్పారు. బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచన అని చెప్పి రేవంత్.. రాహుల్ ఆలోచన మేరకు బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామని, సుప్రీం కోర్టు తీర్పు ను పూర్తిగా అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెప్పారు. దేశంపై నాలుగోసారి పట్టు సాధించడానికి మోడీ ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పిన రేవంత్.. నాలుగో సారి గెలవడం కోసమే ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలు తీసుకువస్తున్నారని ఆరోపించారు.

ఇక తొమ్మిది నెలల్లో ఒక్క రోజు కూడా తాను సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 27 రోజుల్లో 18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదని, రైతు రుణ విముక్తి కావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నామని చెప్పిన సీఎం.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే అవకాశం కల్పించబోతున్నామని తెలిపారు. ఇంచార్జ్ మంత్రులు వారానికి రెండు సార్లు  జిల్లాల్లో పర్యటించాలని సీఎం రేవంత్ సూచించారు. అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందమని మండిపడ్డారు. ప్రతీ ఎమ్మెల్యే సాయంత్రం 4 నుంచి 6 వరకు ప్రజలను కలవడానికి ప్రత్యేకంగా  సమయం కేటాయించాలని చెప్పారు. కొందరు ఎమ్మెల్యే లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పిన రేవంత్.. జగ్రత్తగా మెలగాలని హెచ్చరించారు.


Comment As:

Comment (0)