Roja

తిరుమల లడ్డు అంశంపై ఘాటుగా స్పందించిన రోజా

తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా (Roja) స్పందించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరును ఆమె తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో వచ్చిన వరదలు, జరిగిన అఘాయిత్యాలు, వైసీపీపై దాడులు, హామీల వైఫల్యం వంటి వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తిరుమల వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగారని రోజా ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు మరీ ఇంత దిగజారి మాట్లాడతారని ఊహించలేదని రోజా చెప్పారు. 

టీటీడీలో ముఖ్యమంత్రి జోక్యం ఉండదని స్వయంగా నారా లోకేష్ చెప్పారని గుర్తుచేసిన రోజా.. అలాంటిది ఈ వ్యవహారంలో వైఎస్ జగన్‌పై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత టీటీడీ ఈవోగా జూన్ 21వ తేదీ శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారని ఆమె గుర్తు చేశారు.జులై 6, జులై 12వ తేదీల్లో ట్యాంకర్లలో నెయ్యిని పరీక్షించారన్న రోజా.. జులై 23న వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ చేశారంటూ శ్యామలరావు ఆ ట్యాంకర్లను తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు. కానీ రెండు నెలల తరువాత తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందంటూ చంద్రబాబు ప్రకటించడం ఏమిటని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు నిందల తర్వాత టీటీడీ ఈవోపై ఒత్తిడి తెచ్చి మరోసారి ప్రెస్ మీట్ పెట్టించారని ఆమె మండిపడ్డారు. ఇక తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారన్న రోజా.. చంద్రబాబు చేస్తున్న తప్పుల భయం తనకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయంతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారని విమర్శించారు.


Comment As:

Comment (0)