గన్‌మన్‌ చెంపపై కొట్టిన హోంమంత్రి మహమూద్‌ అలీ

పోలీసు శాఖలో కలకలం రేపుతున్న హోంమంత్రి వ్యవహారం

గన్‌మన్‌ చెంపపై కొట్టిన హోంమంత్రి మహమూద్‌ అలీ

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలి (Mahmood Ali) వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఎప్పుడూ శాంతంగా కనిపించే మహమూద్‌ అలీకి ఒక్కసారిగా కోపం వచ్చింది. తన గన్‌ మన్‌ చెంపపై కొట్టడం రాజకీయవర్గాలతో పాటు పోలీసుశాఖలోను కలకలం రేపుతోంది. శుక్రవారం హైదరాబాద్‌ లోని అమీర్‌పేట ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో కాసేపటికే హోంమంత్రి మహమూద్‌ అలీ అక్కడికి వచ్చారు. వచ్చీరాగానే వేదికపైన ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కౌగిలించుకుని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

తరువాత తన గన్‌మన్‌ ను పూలబొకే ఏదని ప్రశ్నిస్తూనే చెంపపై కొట్టారు. దీంతో తలసాని సహా అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఇంతలో తలసాని... పోనీలే అన్నా అంటూ వారించారు. ఇప్పుడు ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ ఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ వెంటనే క్షమాపణ చెప్పాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. మొత్తానికి హోం మంత్రి మహమూద్‌ అలీ గన్ మెన్ పై చేయి చేసుకోవాడం పోలీసు శాఖలో చర్చనీయాంశమవుతోంది.