Amarnath

కట్టుదిట్టమైన భద్రత మధ్య మంచు శివలింగ దర్శనం

అమర్ నాధ్ యాత్ర - తొలి రోజు 13 వేల మంది భక్తులు 

జమ్మూ కశ్మీర్ రిపోర్ట్- భారత్ లో భక్తులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పవిత్ర అమర్‌నాథ్ యాత్ర మొదలైంది. శనివారం రోజు ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమర్‌నాథ్ గుహలో ఉన్న మంచు శివలింగాన్ని మొదటిరోజు 13 వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో వరుసగా ఉగ్ర దాడులు, ఉగ్రవాదుల సంచారం నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని జంట బేస్‌ క్యాంపులైన బాల్టాల్, నున్వాన్‌ల నుంచి భారీ బందోబస్తు మధ్య మొదటి బ్యాచ్‌ యాత్రికులు బయలుదేరి అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. కాశ్మీర్‌లోని బేస్‌ క్యాంపుల నుంచి బయల్దేరిన తొలి బ్యాచ్‌ యాత్రికులు నడక మార్గంలో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌ నాథ్‌ గుహను చేరుకున్నారు. ఇక జమ్మూలోని భగవతినగర్‌ బేస్‌ క్యాంపు నుంచి 1881 మంది యాత్రికులతో కూడిన రెండవ బ్యాచ్‌.. కాశ్మీర్ బేస్ క్యాంపులకు శనివారం బయలుదేరి చేరింది. వీరిలో 427 మంది మహిళలు, 294 మంది సాధువులు ఉన్నారని అధికారులు తెలిపారు.


Comment As:

Comment (0)