మీ స్కిన్ కేర్ రహస్యమేంటని ప్రధాని మోదీని అడిగిన హర్లీన్ డియోల్
వన్డే ప్రపంచ కప్ ను మొదటిసారి గెలిచిన భారత మహిళా జట్టుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భేటీ అయ్యారు. మహిళా జట్టులోని ప్రతి ప్లేయర్ తో ప్రత్యేకంగా మాట్లాడిన మోదీ.. వారిని ప్రశంసించారు. మ్యాచ్ లో భాగంగా ఫైనల్ బంతిని హర్మన్ జేబులో వేసుకోవడం గురించి ప్రధాని ఆరా తీశారు. అదృష్టవశాత్తూ బంతి తన దగ్గరకు వచ్చిందని, దాన్ని తన దగ్గరే పెట్టుకున్నానని హర్మన్ మోదీకి సమాధానం ఇచ్చింది. ఇక హర్లీన్ డియోల్ 2021లో ఇంగ్లాండ్ పై అందుకున్న అద్భుత క్యాచ్ ను సైతం ప్రధాని ప్రత్యేకంగా గుర్తు చేశారు. భారత మహిళా జట్టుతో జరిపిన సంభాషణకు సంబందించిన వీడియోను ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.
భారత మహిళా జట్టుతో సంబాషణ సందర్భంగా హర్లీన్ డియోల్ (Harleen Deol) ప్రధాని మోదీని ఓ ప్రశ్న అడిగింది. దానికి ఆయనతో సహా మిగతా ప్లేయర్లూ అంతా నవ్వేశారు. ప్రధాని మోదీతో ఒక్కొక్క ప్లేయర్ వరుసగా మాట్లాడుతూ వచ్చారు. హర్లీన్ డియోల్ వంతు వచ్చేసరికి ఆమె ఎలాంటి ప్రశ్న అడుగుతుంది? ఏం మాట్లాడుతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. మైక్ అందుకున్న హర్లీన్ డియోల్ సర్.. మీ స్కిన్ ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది.. మీ స్కిన్‌కేర్ వెనక రహస్యమేంటో మాకు చెప్పగలరా? అని నవ్వుతూ అడిగింది. అసలు ఏ మాత్రం ఊహించని విధంగా హర్లీన్ నుంచి ఎదురైన ప్రశ్నకు అంతా ఒక్కసారిగా నవ్వేశారు. ప్రధాని మోదీ కూడా చిరునవ్వుతో స్పందించి నేను వాటి గురించి ఆలోచించను అంటూ సింపుల్ గా సమాధానం చెప్పారు.
ఇదే సమయంలో వెంటనే జట్టు సభ్యుల్లో ఒకరు సర్.. ఇదే దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే అనగానే అంతా మరోసారి నవ్వారు. భారత మహిళా జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ (Amol Muzumdar) సరదాగా స్పందిస్తూ.. చూశారా సర్, ఇలాంటివారిని నేను డీల్ చేయాల్సి వచ్చింది. అందుకే, నా జుట్టు త్వరగా తెల్లబడిపోయింది అని కామెంట్ చేశారు. భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) వేయించుకున్న హనుమాన్ టాటూ గురించి కూడా ప్రధాని మోదీ ఆరా తీశారు. హనుమంతుడి టాటూ ఉంది.. అది ఎలా సాయపడింది? అని దీప్తీ శర్మను అడిగారు. అందుకు సమాధానం ఇచ్చిన దీప్తీ.. నాకు హనుమంతుడంటే చాలా ఇష్టం.. నేను ఎక్కువగా నమ్ముతా.. నా ఆటతీరు మెరుగుకావడానికి వ్యక్తిగతంగా నాకు సాయపడింది ఈ టాటూ.. మీరు ఇచ్చే ప్రసంగాలను తరచూ వింటుంటా.. చాలా క్లిష్టమైన విషయాలనూ ప్రశాంతంగా హ్యాండిల్ చేస్తారు.. ఆ లక్షణం చూసి నేను చాలా నేర్చుకున్నా అని దీప్తి శర్మ చెప్పుకొచ్చింది.