జల వివాదాలపై కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందాం
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు, పంచాయితీలు, న్యాయస్థానాలు వద్దని.. మనమే కూర్చుని చర్చిద్దామని ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా.. నీళ్లు కావాలా.. అని అడిగితే నీళ్లే కావాలని కోరుకుంటానని ఆయన చెప్పారు. వివాదం కావాలా.. పరిష్కారం కావాలా.. అని అడిగితే పరిష్కారం కావాలని బదులిస్తాని రేవంత్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారమైతే ప్రజలు, రైతులు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వాటికి నీళ్లు కావాలంటే కృష్ణా జలాల వివాదం పరిష్కారం కావాలని అన్నారు.
నీళ్ల వివాదాలపై పదేపదే చర్చలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో రాజకీయాలకతీతంగా మాట్లాడుకుందామని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. న్యాయస్థానాల వద్దకు, పెద్దమనుషుల పంచాయితీలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. కృష్ణా నదిపై ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు వంటివి ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులేనని చెప్పుకొచ్చారు. అందుకే ఈ ప్రాజెక్టులకు అభ్యంతరాలు వ్యక్తం చేయవద్దని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. నీటి అంశాలు, నీళ్ల వివాదాల ముసుగులో రాజకీయ ప్రయోజనాలను కోరుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కృష్ణా జలాల అంశాన్ని రాజకీయ లబ్ధికి వినియోగించుకోవద్దన్న సీఎం రేవంత్ రెడ్డి.. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని హితువు పలికారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైన సాగునీటి ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అడ్డు పడడం వల్ల పర్యావరణ, ఇతర అనుమతులు రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేధన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు 60 శాతం నిధులు కేంద్రం నుంచి రాకపోవడంతో.. రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని అన్నారు. తెలంగాణకు తగినన్ని నీళ్లు లేవు... ఓడరేవు లేదు.. ఈ నేపథ్యంలో భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు 12 వరుసల రహదారితో పాటు దానికి సమాంతరంగా రైల్వేలైన్ ఉండేలా అనుమతులివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించామని గుర్తు చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం కావాలని రేవంత్ కోరారు. ఏపీ సహకరిస్తే.. అమరావతి నిర్మాణానికి మేం సహకరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో సాంకేతిక నైపుణ్యాలున్న మానవ వనరులు ఉన్నాయన్న సీఎం.. ఇందుకోసం రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనేలా చర్చలు కొనసాగుతాయని చెప్పారు. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతోనూ కృష్ణాజలాల అంశంపై చర్చలు కొనసాగించనున్నామని స్పష్టం చేశారు.