chandrababu

నీళ్ల విషయంలో గొడవలు పడితే నష్టపోయేది తెలుగు ప్రజలే- సీఎం చంద్రబాబు

నీటి విషయంలో గొడవలు పడితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని చంద్రబాబు చెప్పారు. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో  సీఎం చంద్రబాబు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాయలసీమకు నీరందించామనటానికి పట్టిసీమ ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టు ఫలితంగానే ఉద్యాన రంగం అభివృద్ధి చెందిందని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్‌ ను పూర్తిచేయకుండా 2020లోనే నిలిపివేసి ఇప్పుడు స్వార్థరాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేవలం మట్టిపనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నీటి విషయంలో రాజీపడేది లేదని తేల్చిచెప్పారు.

మాజీ సీఎం వైఎస్ జగన్‌కు నాగరికత తెలిస్తే నదుల గురించి దుష్ప్రచారం చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సింధు నాగరకత ఎలా వచ్చిందో అతను తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ రాజధాని దిల్లీ సహా ప్రధాన నగరాలు ఎక్కువగా నదీ తీరాల వెంబడి ఉండబట్టే అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలూ నదీతీర ప్రాంతాల్లోనే ఉన్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నదీ గర్భానికి.. నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు బుద్ధి చెప్పినా రాజధానిపై విషం చిమ్మటం అపడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. నీటిని సద్వినియోగ చేసుకుంటున్నాం కాబట్టే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ది చెందిందన్నారు. దేశంలోనే ఉద్యాన రంగంలో మొదటి స్థానంలో ఉన్నామని చెప్పిన చంద్రబాబు.. రానున్న పదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌ స్థానానికి వెళ్తామని తెలిపారు.


Comment As:

Comment (0)