ఘనంగా అనంత్ అంబానీ, రాధికా పెళ్లి వేడుక
బాలీవుడ్ స్టార్స్ కు అంబానీ ఖరీదైన బహుమతులు
ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ కంపెనీల చైర్మెన్ ముకేశ్ అంబానీ, నీతా అంబానీల తనయుడు అనంత్ అంబాని, ఫార్మారంగ దిగ్గజ బిజినెస్ మ్యాన్ వీరేన్ మర్చంట్, శైల మర్చంట్ ల కూతురు రాధికా మర్చంట్ ల వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సు లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుక కోసం ముఖేశ్ అంబానీ సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో దేశ విదేశాలకు చెందిన సినీ, వ్యాపార, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
అనంత్ అంబానీ, రాధికల పెళ్లికి హాజరైన బాలీవుడ్, హాలీవుడ్ అతిధులకు అత్యంత ఖరీదైన వాచీలను బహుమతిగా ఇచ్చారట ముఖేశ్ అంబాని కుటుంబం. అడెమార్స్ పిగ్యుట్ (Audemars Piguet) బ్రాండ్ కు చెందిన ఈ వాచీ ధర సుమారు కోటిన్నర నుంచి 2 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. పెళ్లి వేడుకకు విచ్చేసిన కొంత మంది అతిథుల కోసం పెళ్లి కొడుకు అనంత్ అంబానీ ఈ ఖరీదైన వాచీలను ప్రత్యేకంగా తయారు చేయించారని తెలుస్తోంది. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, షారుక్ ఖాన్ తో పాటు హాలీవుడ్ తారలకు ఈ వాచీలు గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం. ఈ వాచీలతో వారంతా ఫొటోలకు పోజులివ్వడంతో అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.