జూన్ 27న ప్రేక్షకుల ముందుకు ‘కల్కి 2898 ఏడీ’
కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
హైదరాబాద్-ముంబయి రిపోర్ట్- రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సరికొత్త, అత్యాధునిక వాహనాలే కీలకమన్నమాట. ఈ వాహనాలను రూపొందించేందుకు కల్కి టీమ్ కు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగించాల్సి వచ్చింది. అందుకని సినిమా మొదలుపెట్టే టైంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, మహీంద్రా కంపెనీ చైర్మెన్ ఆనంద్ మహీంద్రాను ట్విట్టర్- ఎక్స్ వేదికగా సాయం చేయాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
అదిగో అలనాటి సంగతులను గుర్తు చేస్తూ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra).. డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు గుప్పించారు. ఆయనను చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు. ఈ మేరకు ఎక్స్-ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు ఆనంద్ మహీంద్రా. గతంలో తన సాయం కోరుతూ నాగ్ అశ్విన్ పెట్టిన ట్వీట్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. నాగ్ అశ్విన్, అతడి టీమ్ గొప్పగా ఆలోచించడానికి భయపడరు.. వారిని చూస్తుంటే గర్వంగా ఉంది.. అధునాతన వాహనాలు తయారు చేయడంలో కల్కి మూవీ బృందానికి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ సహాయపడింది.
కల్కిలోని బుజ్జి వాహనం రెండు మహీంద్రా ఇ- మోటర్లతో నడుస్తుంది. జయం ఆటోమోటివ్స్ కూడా ఈ వెహికల్ రూపొందించడంలో భాగమైంది.. అని తెచెప్పుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. ఇక ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. అసాధ్యం అనుకున్న కలను సుసాధ్యం చేశారంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. అందుకు మళ్లీ ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ... కలలు కనడం మానొద్దు.. అంటూ రిప్లై ఇచ్చారు.
ఇక కల్కి సినిమాలోని బుజ్జి వాహనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్ర బృందం బుధవారం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న కల్కి 2898 ఏడీ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు.