Revanth Supreme Court

భారత న్యాయవ్యవస్థ పట్ల గౌరవం, విశ్వాసం ఉన్నాయి-రేవంత్

సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

సుప్రీం కోర్టుకు (Supreme Court) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) క్షమాపణలు చెప్పారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కరా స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరవ్వగా, అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రకటనలను ఈ రోజు పత్రికల్లో చదివాం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి? మేం రాజకీయపార్టీలను సంప్రదించో.. లేక రాజకీయాంశాల ఆధారంగానో ఉత్తర్వులిస్తామా?.. అని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. 

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన వ్యాఖ్యలపై శుక్రవారం ఉదయం స్పష్టతనిచ్చారు. ట్విట్టర్-ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టిన రేవంత్.. నా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారు.. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా.. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయి.. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే నేను.. ఎన్నటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటా.. అని పేర్కొన్నారు. కవిత బెయిల్ పై అధికార కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా బీజేపీ నేతలు సైతం అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 


Comment As:

Comment (0)