కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం
తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం- సీఎం రేవంత్
రంగారెడ్డి రిపోర్ట్- కేంద్రంలో ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న సానుకూల పరిస్థితులే దేశమంతటా ఉన్నాయని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో ఈ నెల 6న నిర్వహించనున్న జన జాతర బహిరంగసభ ఏర్పాట్లపై సభా ప్రాంగణంలో గురువారం సీఎం రెవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అంతకుముందు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తుక్కుగూడ జన జాతర సభా ప్రాంగణానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని, కాంగ్రెస్ టికెట్లు పొందిన వారు చాలా అదృష్టవంతులని ఈ సందర్బంగా రేవంత్ అన్నారు. మిగిలిన మూడు ఎంపీ స్థానాలను ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ పంచుకోవాలని ఆయన చెప్పారు. అందరి చూపు తెలంగాణపైనే ఉందని, జన జాతర సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. సభ ఏర్పాట్లు, జన సమీకరణ, నిర్వహణ తదితర అంశాలపై కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. దేశంలో బీజేపీపై వ్యతిరేకత ఉందని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ పార్టీకి ఎదురు లేదన్నట్లు కావాలనే అతిగా ప్రచారం చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో బీజేపీకి వ్యతిరేక వాతావరణం ఉందని, అలాంటప్పుడు 400 సీట్లు ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 6 గ్యారంటీల మాదిరిగానే దేశవ్యాప్తంగా మరో 5 గ్యారంటీలు రాబోతున్నాయని అన్నారు.