ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తా- కేజ్రీవాల్ సంచలన నిర్ణయం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకూ సీఎం పదవిలో ఉండనని ఆయన తేల్చి చెప్పారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్.. ఈమేరకు ఈ ప్రకటన చేశారు. ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు దేవుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని కేజ్రీవాల్ ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతామని అన్నారు. ఆప్ నాయకులు అమానతుల్లా ఖాన్, సత్యేందర్ జైన్ ఇంకా జైల్లోనే ఉన్నారని గుర్తు చేసిన కేజ్రీవాల్ త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ ఎమ్మెల్యేల నుంచి మరొకరు ఎంపిక అవుతారని చెప్పిన సీఎం కేజ్రీవాల్.. ఈ క్రమలం రెండు, మూడు రోజుల్లో పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆప్ లో చీలికలు తెచ్చి ఢిల్లీలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ను ముక్కలు చేసేందుకే తనను జైలుకు పంపారని.. కానీ ఎన్ని ఎత్తులు వేసినా పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయిందని అన్నారు. తనను జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా రాజ్యాంగాన్ని రక్షించాలనే ఇన్నాళ్లు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదని చెప్పారు.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. దీంతో సుమారు ఆరు నెలల తర్వాత ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు సీఎం కేజ్రీవాల్. ఇక వచ్చే యేడాది 2025 ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు నవంబర్ లో నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతానని.. ఢిల్లీ మద్యం కేసులో తాను నిర్దోషినని నమ్మితే ప్రజలు ఓట్లు వేయాలని కోరారు.