టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ పరీక్ష సక్సెస్ ఫుల్
ఇస్రో గగన్ యాన్- టీవీ-డీ1 పరీక్ష విజయవంతం
స్పెషల్ రిపోర్ట్- అంతరిక్షంలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్ యాన్ (Gaganyaan) సాకారం దిశగా మొదటి అడుగు వేసింది ఇస్రో. గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (TV-D1) వాహకనౌక పరీక్షను శనివారం సక్సెస్ ఫుల్ గా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్.. పారాచూట్ల సాయంతో సముద్ర ఉపరితలంపై సేఫ్ గా దిగింది.
గగన్ యాన్ రాకెట్ నింగిలోకి బయల్దేరాక ఇస్రో సైంటిస్టులు అబార్ట్ సిగ్నల్ ను పంపించారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్ సిస్టమ్ కు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు మండాయి. సుమారు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్ సిస్టమ్ ను రాకెట్ నుంచి వేరు చేశాయి. ఆ తరువాత 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి. వెంటనే డ్రోగ్ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సేఫ్ గా బంగాళాఖాతంలో దిగింది.
గగన్ యాన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపించాలన్నది ఇస్రో లక్ష్యం. మూడు రోజుల తర్వాత వారిని తిరిగి భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ ప్రతిష్టాత్మకమైన యాత్ర చేపట్టేందుకు ఇస్రో సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ముందుగా టీవీ-డీ1 పరీక్షను నిర్వహించింది. ఇందులో క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్ఠతను ఈ సన్నాహక పరీక్షలో పరిశీలించారు. అటు సముద్ర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ ఇస్రో పరీక్షిస్తుంది. గగన్ యాన్ టెస్ట్ మ్యాడ్యుల్ టీవీ-డీ1 పరీక్షను విజయవంతంగా నిర్వహించడంతో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు.
Gaganyaan Test Flight