తెలంగాణలో మళ్లీ గ్రూప్-2 పరీక్ష వాయిదా
గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా.. కొత్త తేదీలు ఇవే..
స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించాల్సిన గ్రూప్-2 (TSPSC Group 2) పరీక్ష మరోసారి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 2, 3 న గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఐతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక TSPSC Group 2 పరీక్షను వచ్చే ఏడాది 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా, కొత్త తేదీల ఖరారుకు సంబంధించిన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో టీఎస్పీస్సీ గ్రూప్-2 (Group 2) పరీక్ష జరగాల్సి ఉంది. అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో గ్రూప్-2 పరీక్షను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టమని భావించిన టీఎస్ పీఎస్సీ అధికారులు మరోసారి పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించారు. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే యేడాది 2024 జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగనుంది.