కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఢిల్లీ రిపోర్ట్- ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్ 4కు వాయిదా పడింది. తన కొడుకు పరీక్షల దృష్ట్యా ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మార్చి 26న రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారామె. కవిత పిటిషన్ పై సమాధానం చెప్పాలని న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. గత నెల మార్చి 15న హైదరాబాద్ లోని తన నివాసంలో కవితను అరెస్ట్ చేసిన ఈడీ, మరుసటి రోజు మార్చి 16న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది.
ఈడీ 10 రోజుల కస్టడీకి కోరగా కోర్టు ఏడు రోజులకు అనుమతి ఇచ్చింది. ఆ తరువాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా మరో మూడు రోజులకు అనుమతించింది. మార్చి 26న ఈడీ కస్టడీ ముగియడంతో అదే రోజు కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు కవితను హాజరు పరిచారు. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో తిహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి కవిత తీహార్ జైలులోనే ఉంటున్నారు.