సౌర అన్వేషణ కోసం వచ్చే నెలలో ఆదిత్య-ఎల్ 1 (Aditya-L1) ప్రయోగం
సూర్యుడిపై పరిశోధనలకు రెడీ అయిన ఇస్రో - సెప్టెంబరు 2న ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం
స్పెషల్ రిపోర్ట్- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో (ISRO) మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్దమైంది. ఇప్పటికే చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 (Chandrayaan-3) ని విజయవంతంగా ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు అదే ఉత్సాహంతో సూర్యుడి (Sun) రహస్యాలను తెలుసుకునేందుకు రేడీ అయ్యింది ఇస్రో. సెప్టెంబరు 2వ తేదీన సూర్యుడి పై పరిశోధనల కోసం ఆదిత్య-ఎల్ 1 (Aditya-L1) ప్రయోగం చేపట్టబోతోంది. ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహాన్ని ఇప్పటికే సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) కు తీసుకొచ్చారు. ఆదిత్య-ఎల్ 1 (Aditya-L1 )ను పీఎస్‌ఎల్‌వీ-సి 57 వాహకనౌక మోసుకుని ఆకాశంలోకి వెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఇస్రో తెలిపింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో (ISRO) ఈ సౌర అధ్యయన ప్రక్రియను చేపడుతోంది.
సూర్యుడి (SUN)ని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న మొదటి మిషన్ ఇది. మొత్తం 1500 కిలోల బరువున్న శాటిలైట్ ను భూమి (Earth) నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 (Lagrange Point) (L1) చుట్టూ ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. ఇస్రో ప్రయోగించే ఆదిత్య-ఎల్ 1 (Aditya-L1) మొత్తం ఏడు పేలోడ్లను తీసుకెళ్లనుంది. సూర్యుడి నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్ లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడంతో పాటు ప్రగ్యాన్ రోవర్ పరిశోధనలు కూడా మొదలుపెట్టింది. దీంతో ప్రపంచమంతా ఇప్పుడు మన భరత్ వైపు చూస్తోంది.