లోకేశ్ బాధను ఓ కొడుకుగా అర్ధం చేసుకోగలనన్న కేటీఆర్
చంద్రబాబు భద్రతపై లోకేశ్ ఆందోళన బాధ కలిగించింది- కేటీఆర్
హైదరాబాద్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) భద్రతపై టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) చేసిన ట్వీట్ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. ఉదయం లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించిందన్న కేటీఆర్, చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలనని అన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ చెప్పింది వాస్తవం ఐతే ఈ పరిస్థితి బాధాకరమని చెప్పారు. నాకు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నిజానిజాలు తెలియవన్న కేటీఆర్, ఆయన భద్రతకు ప్రమాదం అయితే రాజకీయాల్లో ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
లోకేష్ పరిస్ధితిని అర్ధం చేసుకోగలనని, రాజకీయాలు వేరైనా ఆయన కుటుంబం బాధను నేను అర్ధం చేసుకోగలనని చెప్పారు. నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యంపై మేము కూడా చాలా ఆందోళన చెందామని గుర్తుచేసుకున్నారు కేటీఆర్. కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని ఇంటలిజెన్స్ అధికారులు మమ్మల్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ శాంత భద్రతలకు విఘాతం కలగవద్దన్న నేపథ్యంలోనే ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ పై అందోళన చేయడం వద్దన్నానని కేటీఆర్ ట్విట్టర్ ద్వార వివరణ ఇచ్చారు.