Kim

కిమ్ ఫొటోలకు ఏమైనా జరిగిందో.. తుపాను వేళ ప్రజలకు ఉత్తర కొరియా హెచ్చరిక

ఇంటర్నేషనల్ డెస్క్- ఉత్తర కోరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) నియంతృత్వ పాలన గురించి ప్రపంచమంతా తెలుసు. ఇప్పుడాయన పిచ్చి పీక్ స్టేజ్ కు చేరుకుంది. దేశాన్ని కరవు కాటకాలు పీడిస్తున్నా, ప్రజలు ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నా, తన పేరు ప్రతిష్ఠలకు దెబ్బ తగలకూడదనే అర్ధంలేకుండా సాగుతున్న కిమ్ పాలనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా జారీ  చేసిన ఉత్తర్వులు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

గత కొన్ని రోజులుగా జపాన్‌ పై తీవ్ర ప్రభావం చూపుతున్న ఖనూన్ తుపాను (storm Khanun) ఉత్తర కొరియా వైపు దూసుకొస్తోంది. ఇది ఇప్పటికే దక్షిణ కొరియా (South Korea) లో బీభత్సం సృష్టిస్తోంది. వరదలు ముంచెత్తడంతో పాటు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరగుతోంది. ఈ ఖనూన్ తుపాను ఉత్తర కొరియాపై అదేస్థాయి ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థలో వచ్చిన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముంచుకొస్తున్న తుపాను సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఆయన తండ్రి కిమ్ జోంగ్‌ ఇల్‌ ( Kim Jong il), తాత (ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు) కిమ్ ఇల్ సంగ్(Kim Il sung) ఫోటోలు ఏ మాత్రం దెబ్బతినకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రకటనలో హెచ్చరించింది ప్రభుత్వం. 

 కిమ్ వంశస్తుల పాలన దైవికమని, ఆ పాలకుల ఫోటోలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని అక్కడ దేశ ప్రజలు గట్టిగా నమ్ముతారు. దీంతో ఉత్తర కొరియాలోని ప్రతి కార్యాలయాల్లోనే కాదు ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కిమ్ తండ్రి, తాతతో పాటు ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ ఫోటోలు ఉంటాయి. ఏదైనా కారణంతో ఫోటోలు దెబ్బతింటే మాత్రం పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఒక్కోసారి వారికి మరణ శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అన్నట్లు ఉత్తర కొరియా ప్రస్తుతం పేదరికంలో కొట్టుమిట్టాడుతుండటంతో, దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. చాలా మంది ప్రజలు ఆహారం లేక నరకం అనుభవిస్తున్నారు. దీనికి తోడు తుఫాను ముంచుకొస్తుండటం అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇటువంటి సమయంలో తన ఫోటోలను కాపాడుకోవాలని కిమ్ చెప్పడం ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేస్తోంది.


Comment As:

Comment (0)