పదవ తరగతి పాసైతే చాలు
తపాలా శాఖలో భారీగా ఉద్యోగ అవకాశాలు - 30 వేల పోస్టులకు నోటిఫికేషన్
స్పెషల్ రిపోర్ట్- ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ (Indian Posta Department) లో ఉద్యోగాల జాతర కంటిన్యూ అవుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో 40 వేలకు పైగా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించిన తపాలాశాఖ, మే నెలలో మరో 12,828 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో 30 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది పోస్టల్ డిపార్ట్ మెట్. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ నెల 23వరకు ఆన్ లైన్ లో https://indiapostgdsonline.gov.in/ ద్వార దరఖాస్తులు చేసుకోవచ్చు.
బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంతే కాకుండా అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. ఆయా ఉద్యోగాలను బట్టి బీపీఎంకు వేతన శ్రేణి 12 వేల నుంచి 29,380 రూపాయలు, ఏబీపీఎం- డాక్ సేవక్ కు10వేల నుంచి 24,470 రూపాయలుగా ఉంది. ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్దులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
Postal GDS Job notification - ఇక పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఇప్పుడు నోటిఫికేషన్ లో పేర్కొన్న మొత్తం 30,041 పోస్టులకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1058, తెలంగాణలో 961 చొప్పున ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు కేవలం నాలుగు గంటల పాటు పనిచేస్తే సరిపోతుందట. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసేయండి.