గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 40 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సినీమా ఇండస్ట్రీకు ఆయన చేసిన సేవలకు గానూ ఈ మధ్యనే ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు చిరంజీవి. ఈ క్రమంలో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్. ఏకంగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో (Chiranjeevi Guinness World Record) చోటు దక్కించుకున్నారు చిరంజీవి. మొత్తం 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించినందుకు చిరంజీవికి ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కు చెందిన ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును చిరంజీకికి ప్రదానం చేశారు.
హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు కే.రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామి రెడ్డి, గుణశేఖర్, బాబీతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. మెగా కుటుంబానికి చెందిన పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రమిుఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.