ఆ హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు
ఇప్పుడంటే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా కారణంగా సెలెబ్రెటీలకు, అభిమానులకు మధ్య గ్యాప్ తగ్గింది కానీ గతంలో పరిస్థితి వేరు. సినిమా నటులకు ప్రత్యేకంగా అభిమానులుంటారు. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ ఫ్యాన్స్ గరించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ మాత్రం అవకాశం దొరికినా వారిని చూసేందుకు, వారితో కలిసి ఫోటో దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపుతారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యాన సినిమా స్టార్స్ తో అభిమానులు మాట్లాడగలుగుతున్నారు. కానీ ముప్పై ఏళ్ల క్రితం పరిస్థితి చాలా కఠినతరంగా ఉండేది. సినిమా వాళ్లను చూడాలంటే చాలా కష్టమైన పనేనని చెప్పవచ్చు.
1990లో అంటే సరిగ్గా 34 ఏళ్ల క్రితం ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా (Govinda) విషయంలో జరిగి ఘటనను ఆయన భార్య సునీత గుర్తు చేసుకున్నారు. అప్పట్లో గోవిందా టాప్ హీరో. లవ్ మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోగా నటించి అలరించిన బాలీవుడ్ హీరో గోవిందా సినీ ప్రేక్షకులకి సుపరిచితమే. ఇలాంటి సమయంలో ఓ యువతి తన ఇంట్లో పని మనిషిగా చేరిందని, కానీ తనకి ఇంటిపనులు చెయ్యడం అస్సలు రాదని గుర్తించినట్లు చెప్పారు సునీత. దీంతో ఇంటి పనుల విషయంలో ఒకటి రెండు సందర్బాల్లో ఆ యువతిని నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పేదట.
కానీ తన భర్త గోవింద ఇంట్లో ఉన్నప్పుడు, లేదంటే సినిమా షూటింగులకు వెళ్లి వచ్చినపుడు మాత్రం అతడికి కావాల్సిన పనుల్లో సహాయం చెయ్యడానికి ఎక్కువగా మొగ్గు చూపేదట ఆ యువతి. దీంతో ఆ యువతిపై అనుమానం వచ్చి నిలదీయగా షాకింగ్ నిజం తెలిసిందట. ఆ యువతి ఓ ప్రముఖ మంత్రి కూతురని తెలియగానే ఒక్కసారిగా తాము అవాక్కయినట్లు చెప్పుకొచ్చింది గోవింద భార్య సునీత. కాస్త అనుమానంగానే ఆమె కుటుంబ సబ్యులకు కబురు చేస్తే.. ఖరీదైన నాలుగైదు కార్లలో వచ్చి యువతిని తీసుకెళ్లారట. ఈ సంఘటన తర్వాత తన భర్త గోవింద ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది.