నేను ఏ తప్పు చేయలేదు..కోల్ కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడి ట్విస్ట్
సంచలనం సృష్టించిన కోల్ కతా వైద్య విధ్యార్ధిపై అత్యాచార ఘటన (Kolkata Doctor Rape and Murder)లో నిందితుడు సంజయ్ రాయ్ (sanjay roy) ను సీబీఐ (CBI) అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ కీలక కేసులో పాలీగ్రాఫ్ పరీక్షకు నిందితుడు అంగీకరించడంతో అధికారులకు అనుమతి ఇచ్చింది. ఐతే ఈ కేసు విచారణ సందర్భంగా సంజయ్ రాయ్ కోర్టులో సంచలన ఆరోపణలు చేశాడు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాలీగ్రాఫ్ టెస్ట్ తు ఎందుకు సమ్మతిస్తున్నావ్ అని మేజిస్ట్రేట్ సంజయ్ రాయ్ ను ప్రశ్నించగా, అతడు తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. తాను అమాయకుడినని, తాను ఏ తప్పు చేయలేదని, తనను ఈ కేసులో ఇరికించారని వాపోయినట్లు తెలుస్తంది. పాలీగ్రాఫ్ పరీక్షతో అసలు విషయం బయటపడుతుందని నిందితుడు సంజయ్ రాయ్ మెజిస్ట్రేట్ ముందు చెప్పినట్లు జాతీయ మీడియా కధనాలు వెలువరించాయి.
కోర్టులో నిందితుడు సంజయ్ రాయ్ స్టేట్ మెంట్ తో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగిందనే చెప్పాలి. అంతకు ముందు సీబీఐ విచారణలో సంజయ్ రాయ్ నేరం అంగీకరించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి చెందిన ప్రత్యేక వైద్య బృందం నిందితుడు సంజయ్ రాయ్ మానసిక తీరును పరీక్షించింది. ఈ దారుణ ఘటన సమయంలో ప్రతీ నిమిషం చోటుచేసుకున్న విషయాలను నిందితుడు గుక్కతిప్పకుండా మొత్తం కళ్లకు కట్టినట్లు వివరించాడని, అతడిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కన్పించిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సీబీఐ అధికారి చెప్పినట్లు ప్రచారం జరిగింది.
ఈ ఘోరం జరిగిన కోల్ కతా లోని ఆర్‌జీ కర్ మెడికల్ కళాశాలలో అర్ధరాత్రి సమయంలో నిందితుడు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటిని తాజాగా విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు విడుదల చేశారు. అందులో నిందితుడు సంజయ్ రాయ్ మెడ చుట్టూ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ కన్పించాయి. సెమినార్ హాల్ లో వైద్య విధ్యార్ధి మృతదేహం గుర్తించిన ప్రాంతంలో ఈ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసీటీవీ దృశ్యాల ఆధారంగానే ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ ని అరెస్టు చేశారు పోలీసులు. ఇక ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ కి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఈ సంచలన కేసులో సంజయ్ రాయ్ తో పాటు మరో ఏడుగురికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతివ్వడంతో లై డిటెక్టర్ పరీక్షకు సీబీఐ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.