Oli

నేపాల్‌ కొత్త ప్రధానిగా కె.పి.శర్మ ఓలి

నేపాల్‌ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా కె.పి.శర్మ ఓలి (K P Sharma Oli) నియమితులయ్యారు. అంతకు ముందు నేపాల్ ప్రధానిగా ఉన్న పుష్పకమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పలు రాజకీయ కారణాలతో కుప్పకూలింది. శుక్రవారం పార్లమెంటులోని ప్రతినిధుల సభలో  నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రచండ ఓటమిపాలయ్యారు. కె.పి.శర్మ ఓలి (72) నేతృత్వంలోని సీపీఎన్‌-యూఎంఎల్‌, మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్‌ల కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

ఇప్పటికే 165 మంది పార్లమెంట్ సభ్యుల (సీపీఎన్‌-యూఎంఎల్‌- 77, ఎన్‌సీ- 88) సంతకాలను కె.పి.శర్మ ఓలి సమర్పించారు. మొత్తం 275 సీట్లున్న నేపాల్ పార్లమెంట్ లో విశ్వాస తీర్మానం నెగ్గడానికి 138 ఓట్లు కావాల్సి ఉండగా, ప్రచండకు అనుకూలంగా కేవలం 63 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయనకు 194 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో వెంటనే ప్రచండ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. కొత్త ప్రధానిగా కె.పి.శర్మ ఓలిని నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నియమించారు. ఓలితో పాటు కొత్త మంత్రివర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. 


Comment As:

Comment (0)