వయనాడ్ లో వరద బీభత్సం
కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. 107 మంది మృతి
కేరళలో కురుస్తున్న భారీ వర్షలు భీబత్సం సృష్టిస్తున్నాయి. వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని పలు ప్రాంతాలలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ కొండచరియలు (Wayanad Landslides) విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ఇప్పటివరకు 107 మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మట్టి దిబ్బల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం. వయనాడ్ జిల్లా ముండకైలో అర్ధరాత్రి సుమారు ఒంటి గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండు సార్లు కొండచరియలు విరిగిపడ్డట్లు స్థానికులు చెప్పారు. స్థానికంగా ఉంటున్న 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడింది. ఇప్పటికీ చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు (NDRF) ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 70 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. మెప్పాడి ముండకైలో ప్రాంతంలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. వరదల్లో వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మల పట్టణంలో కొంత భాగం తుడిచి పెట్టుకుపోయినట్లు తెలుస్తోంది. స్థానికంగా వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత భారీ విపత్తును ఇంతకు ముందెన్నడూ ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు.
కేరళ సంఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సాముభూతి తెలిపారు. కేరళకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు ప్రధఆని మోది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ప్రమాదంపై స్పందించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు.