Bonalu 2023

బారులుతీరిన భక్తులు

అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాలు

స్పెషల్ రిపోర్ట్- సికింద్రాబాద్‌- సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా మొదలయ్యాయి. ఆదివారం తెల్లవారు ఝామునుంచే మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. ఉదయం నాలుగు గంటలకు తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. 

ఆలయ సిబ్బంది మంగళ వాయిద్యాలతో కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు. వందల ఏళ్లుగా బోనాల పండగ పరంపర కొనసాగుతోందని ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలోని సమీప జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తున్నారని ఆయన చెప్పారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కిషన్ రెడ్డి ఆకాక్షించారు. దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పిన ఆయన.. నీతి నిజాయితితో పాలన ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. 

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి పరిపాలన వస్తుందని ఆశిస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 
 


Comment As:

Comment (0)