సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చేది ఫిబ్రవరిలోనే..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita williams), బుచ్ విల్‌మోర్ వచ్చే సంవత్సరం 2025 ప్రారంభంలో భమి పైకి రానున్నారు. ఎలాన్ మస్క్ కు సంబందించిన స్పేస్ ఎక్స్‌కు చెందిన క్య్రూ డ్రాగన్ క్యాప్సుల్ (crew dragon spacecraft) లో వచ్చే యేడాది ఫిబ్రవరిలో అంతరిక్ష కేంద్ర నుంచి భూమికి బయలుదేరుతారని నాసా (NASA) పేర్కొంది. బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ లో జూన్ 5న భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా నాసా ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. ఐతే వారం రోజులలోగా ఇద్దరు వ్యోమగాములు భూమిపైకి తిరిగిరావాల్సి ఉంది. కానీ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
స్టార్‌లైనర్ వాహక నౌక (star liner spacecraft) థ్రస్టర్లలో లోపాలు తలెత్తటంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది. దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది. అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. పలుమార్లు స్టార్ లైనర్ ను రిపేర్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది. ఈ నిర్ణయంతో స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఖాళీగానే భూమికి తిరుగు ప్రయాణం అవబోతోంది. ఈ ప్రయాణంలో స్టార్ లైనర్ క్యాప్స్యూల్ పనితీరును నాసా, బోయింగ్ సంస్థ పరిశీలించనున్నాయి. మరోవైపు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్న సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు స్పేస్ స్టేషన్‌లో మరిన్ని పరిశోధనలు, నిర్వహణ, సిస్టమ్ టెస్టింగ్ చేయనున్నారని నాసా తెలిపింది.
అంతరిక్షయానం ఎంతో సురక్షితం, సాధారణమే అయినప్పటికీ ఎప్పటికీ ప్రమాదకరమేనని ఈ సందర్బంగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ అన్నారు. టెస్ట్ ఫ్లైట్ అనేది సాధారణం, సురక్షితం కానే కాదన్న ఆయన.. విల్‌మోర్, విలియమ్స్‌ను స్పేస్ స్టేషన్‌లోనే మరిన్ని రోజులు ఉంచాలని నిర్ణయించామమని తెలిపారు. వారి భద్రత దృష్ట్యా ఖాళీగానే బోయింగ్ స్టార్ లైనర్‌ను కిందికి తీసుకురానున్నామని బిల్ నెల్సన్ స్పష్టం చేశారు. ఇక స్టార్‌లైనర్ సెప్టెంబర్‌లో భూమిపైకి తిరుగుప్రయాణం ప్రారంభించనుందని నాసా ప్రకటించింది. ఐతే వచ్చే యేడాది ఫిబ్రవరి వరకు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ ల ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.