బీఆరఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) కేసులో నిందితురాలిగా ఉన్న తెలంగాణ మాజీ సీఎం కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కవితకు బెయిల్ (Kavitha Bail) మంజూరు చేసింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. సుమారు గంటన్నర పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కి సంబందించిన రెండు కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు న్యాయపూర్తులు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ మంజూరుకు సుప్రీం కోర్టు మూడు ముఖ్యమైన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తిచేసిందని పేర్కొన్న ధర్మాసనం.. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదందని అభిప్రాయపడింది. కవితను మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని.. అందుకే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది మార్చి 15 న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 16 నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటూ వస్తున్నారు.