ఎన్నికలు అవ్వగానే విదేశీ పర్యటనకు సీఎం జగన్, భారతి
విజయవాడ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) విదేశీ పర్యటనకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. యూరప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. మే 17 నుంచి జూన్ 1 వరకు యూరప్ వెళ్లేందుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టును అనుమతి కోరారాయన. దీంతో ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించినట్లు సమాచారం. సీబీఐ కోర్టు నుంచి అనుమతి వస్తే ఈ నెల 17 లేదా 18న యూరప్ ట్రిప్ వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ చదువుకుంటున్న కూతుళ్లతో కొన్ని రోజులు గడపాలని జగన్, భారతి వెళ్తున్నారు. ఈ నెల 30న లేదా జూన్ 1న తిరిగి విజయవాడ వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్కి ఫలితాలకు మధ్య 20 రోజుల సమయం ఉండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.