చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం
దేశంలోనే తొలి సీఎంగా చంద్రబాబు నాయుడు
అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో కన్నా భిన్నంగా పాలన సాగిస్తూ జనం మనసు దోచుకుంటున్నారు. అంతకు ముందు మూడు పర్యాయాలు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాల్గోసారి ముఖ్యమంత్రిగా పరి పాలనలో తనదైన మార్కు చూపుతున్నారు. చంద్రబాబు అంటే మంచి అడ్మినిస్ట్రేటర్ గా ముందు నుంచి మంచి పేరుంది. అందుకు తోడు ఈ సారి ప్రజల మనిషిగా, ప్రజా సీఎంగా తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆసరా, వృధ్యాప్య, దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పింఛన్లను స్వయంగా తానే లబ్ధిదారులకు అందించాలని డిసైడ్ అయ్యారు.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అసరా ఫించన్లను 3వేల రూపాయల నుంచి 4వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అధికారం చేపట్టగానే మొదటి సంతకం పెంచిన ఫించన్లకు సంబందించిన ఫైల్ పైనే పెట్టారు చంద్రబాబు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫించన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని లేఖలో స్పష్టం చేశారు.
జూలై 1 నుంచే పెంచిన సామాజిక భద్రతా ఫించన్లను లబ్ధిదారుల ఇంటి వద్దే అందిస్తామని పేర్కొన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని లేఖలో చెప్పుకొన్నారు. ఈ క్రమంలో దేశంలో ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు జూలై 1న స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఫించన్ అందివ్వనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పెనుమాక గ్రామం వేదిక కాబోతోంది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకువచ్చింది.