ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు
జైలులో నన్ను చంపేందుకు కుట్ర - చంద్రబాబు
అమరావతి రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. రాజమహేంద్రవరం జైల్లో తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలున్నాయని ఆయన జడ్జ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 25న చంద్రబాబు రాసిన 3 పేజీల లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపించారు. తనను జైల్లోనే అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర చేస్తున్నారని లేఖలో అనుమానం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ కుట్రకు సంబందించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి సైతం లేఖ వచ్చిందని, దానిపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదని జడ్జ్ దృష్టికి తెచ్చారు చంద్రబాబు.
అంతే కాకుండా తాను రాజమహేంద్రవరం జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారని, ఆ ఫుటేజీని పోలీసులే లీక్ చేశారని లేఖలో ఆరోపించారు చంద్రబాబు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజీని రిలీజ్ చేశారని, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయని పేర్కొన్నారు. జైల్లో తన భద్రతపై తన భయాలను గాలికొదిలేశారని ఆవేధన వ్యక్తం చేశారు. అంతే కాకుండా జైల్లో డ్రగ్స్ కేసు నిందితుడు పెన్ కెమెరాతో తిరుగుతున్నాడని, ఆ ఖైదీ జైలు లోపల ఫొటోలు తీస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
జైలు ప్రధాన ద్వారం మీదుగా ఈనెల 6న డ్రోన్ ఎగురవేసి, తన కదలికలు తెలుసుకునేందుకు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. తనతోపాటు తన కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందన్న చంద్రబాబు, జైలుపై డ్రోన్ ఎగురవేసింది అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వారేనని అనుమానం వ్యక్తం చేశారు. కొందరు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరారని, గార్డెనింగ్ విధుల్లోని ఖైదీలు వాటిని తీసుకున్నారని చంద్రబాబు జడ్జ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. జడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న తన భద్రతకు ముప్పు ఉందని విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) జడ్జ్ కు రాసిన లేఖలో పిర్యాదు చేశారు చంద్రబాబు.