తీర ప్రాంత జిల్లాల్లో భారీగా ఈదురు గాలులు, వర్షాలు
బాపట్ల దగ్గర తీరాన్ని తాకిన మిగ్ జాం తుఫాను
వెధర్ రిపోర్ట్- మిగ్ జాం (Cyclone Michaung) తుఫాను భీబత్యం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో మిగ్‌జాం తుపాను తీరాన్ని తాకింది. మిగ్ జాం తీరాన్ని తాకే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. తుపాను తీరం దాటిన నేపథ్యంలో బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు సుమారు 2 మీటర్ల ఎత్తు మేర ఎగసిపడుతున్నాయి.
మిగ్ జాం తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యమందా తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు తోడు ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో సైతం మిగ్ జాం తుఫాను ప్రభావం చూపుతోంది. తఫాను నేపధ్యం, భారీ వర్షాల నేపధ్యంలో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.