ఇక ప్రజల్లోకి నారా లోకేశ్, భువనేశ్వరి
నిజం గెలవాలితో జనంలోకి భువనేశ్వరి - భవిష్యత్తుకు గ్యారంటీతో లోకేశ్
అమరావతి రిపోర్ట్- టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అరెస్టును తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన వారి కుటుంబాలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Bhuvaneshwari) పరామర్శించనున్నారు. నిజం గెలవాలి పేరుతో రాష్ట్రంలో జోన్లవారీగా నిర్వహించే సభలు, సమావేశాల్లో భువనేశ్వరి పాల్గొననున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిలిచిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నారా లోకేశ్ (Nara Lokesh) కొనసాగించబోతున్నారు. ఆ తరువాత చంద్రబాబు జైలు నుంచి రాగానే లోకేశ్ యువగళం యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబందించిన కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 21న టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయిస్తారు.
బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యానగర్ లోని శిబిరంలో టీడీపీ ముఖ్యనేతలతో లోకేశ్ భేటీ అయ్యారు. జైలులో ఉన్న చంద్రబాబు కాస్త నీరసంగా ఉన్నారని లోకేశ్ చెప్పారు. చంద్రబాబు అరెస్టు తరువాత, ఆవేదనకు గురై 105 మంది పార్టీ అభిమానులు, నేతలు మృతి చెందారని, వారి కుటుంబాల్ని పరామర్శించి ధైర్యం చెబుతామని, ఇందులో భాగంగానే నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. జోన్‌కు ఒకటి చొప్పున అయిదు జోన్లలో సభలు నిర్వహిచనుండగా.. వాటిలో భువనేశ్వరి పాల్గొంటారు.