పీలేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ
ఏపీలో వైసీపీకి కౌంట్‌డౌన్ మొదలైంది - ప్రధాని మోదీ
పీలేరు రిపోర్ట్- ఏపీ వికాసమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్విహించారు. రాయలసీమ ఖనిజాలు, దేవాలయాలు కలిగిన నేల అని చెప్పిన మోదీ.. ఈ ప్రాంతంలో చైతన్యవంతులైన యువత ఉందని అన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు లేవు, యువత ఉపాధి కోసం వలస వెళ్తున్నారని మోదీ ఆవేధవన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని అన్నారు.
నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైసీపీ మోసం చేసిందని ఈ సందర్బంగా ప్రధాని మోదీ విమర్శించారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి లేదన్న మోదీ..పేదల వికాసం కోసం కాకుండా, మాఫియా వికాసం కోసం వైసీపీ పనిచేసిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందన్న ప్రధాని.. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ఫైర్ అయ్యారు. పుంగనూరులో ఐదేళ్లుగా రౌడీ రాజ్యం నడుస్తోందన్నమోదీ.. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అన్ని మాఫియాలకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తామని హెచ్చరించారు.
ఏపీలో ఐదేళ్లుగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారన్న మోదీ.. ఎన్డీయే ప్రభుత్వం వస్తే సాగునీటి ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తవుతాయని చెప్పుకొచ్చారు. ఉపాధి కోసం వలస వెళ్లేవారిని అన్నిరకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దక్షిణాదిలో కూడా బుల్లెట్ రైలు కావాలని బీజేపీ కోరుకుంటోందని మోదీ అన్నారు. కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉందన్న మోదీ.. వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల పనులు మరింత విస్తరిస్తామని చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.