kurnool bus accident

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 19 మంది సజీవ దహనం

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం జరిగింది. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 41 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. వీరిలో 19 మంది సజీవ దహనం కాగా, 22 మంది గాయాలతో బయటపడ్డారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్లలో ఒకరు పారిపోగా, మరొకరిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. 

అర్ధరాత్రి బస్సు ఓ బైక్‌ ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష్య సాక్షులు చెప్పారు. బస్సు ఢీకొన్న తర్వాత ద్విచక్ర వాహనదారుడు కింద పడిపోయాడు. ఐతే బైక్‌ బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో బైక్‌ లోని పెట్రోల్‌ లీక్‌ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్రమంగా బస్సు అంతా వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొనే లోపే చాలా వేగంగా మంటలు వ్యాపించినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. ప్రాయాణీకులు హాహాకారాలు చేస్తూ కొందరు ఎమర్జెన్సీ డోర్ ద్వార, మరి కొందరు అద్దాలు ద్వంసం చేసి బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. బస్సు ప్రమాద ఘటనపై పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 

బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన వారిని స్థానికుల సహాయంతో పోలీసులు కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. బస్సు ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌ కుమార్‌, అఖిల్‌, జష్మిత, అకీర, రమేష్‌, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాదిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.


Comment As:

Comment (0)