TTD Temple

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ నెయ్యిలో జంతుకొవ్వు

కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati) మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి వినియోగించారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తిరుమల లడ్డూ తయారీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జంతువుల కొవ్వును వినియోగించారన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈమేరకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గురువారం మీడియాకు వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి నాణ్యతకు సంబందించిన నివేదికను విడుదల చేశారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్‌-విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్‌ కు చెందిన నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు లిమిటెడ్‌ సంస్థ వ్యక్తం చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు. 

ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు అంటే ఫారిన్‌ ఫ్యాట్స్‌ కలగలిసి ఉన్నట్లు ఆ పరీక్షల్లో వెల్లడైందని వివరించారు. జగన్ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిని ఒక్కో నమూనాను మొత్తం అయిదు ఈక్వేషన్స్‌లో పరీక్షించారని, వాటన్నింటిలోనూ నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఎస్‌-విలువ వచ్చిందని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చి పరీక్షల కోసం నమూనాలను ఎన్‌డీడీబీ కాఫ్‌ సంస్థకు పంపించగా జులైలో ఫలితాలకు సంబందించిన నివేదికలు వచ్చాయి. ఆ నివేదికలను తెలుగుదేశం పార్టీ తాజాగా విడుదల చేసింది. నెయ్యికి సంబందించిన ఫలితాలను విశ్లేషిస్తే భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయని టీడీపీ చెబుతోంది. 

సాధారణ ఇంటి అవసరాల కోసం కూడా ఇలా జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడరని తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది శ్రీవారి భక్తులు పరమపవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలోనే ఇలాంటివి ఉన్నాయంటే ఘోరమైన అపచారంతో పాటు ఎనలేని పాపమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించామన్న టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదని, అందుకు దేనికైనా సిద్దమేనని వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. దీంతో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 


Comment As:

Comment (0)