త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ-సీఎం చంద్రబాబు
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని, వారి త్యాగాలను మర్చిపోలేమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. అమరావతిలోని పార్టీ కార్యాలయం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు, గ్రామస్థాయి పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు అంటున్నారన్నారని ఈ సందర్బంగా చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని నేతలకు దిశానిర్ధేశం చేశారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
గత వైసీపీ ప్రభుత్వం పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించి ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని, ఎట్టిపరిస్థితుల్లోను దోషులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రజల సెంటిమెంట్ తోనూ ఆడుకునే స్థాయికి వైసీపీ దిగజారిందని.. నేరం చేయడం, తప్పించుకోవడానికి ఎదురుదాడి చేయడం వారికి అలవాటుగా మారిందని చంద్రబాబు విమర్శించారు. ఇలాగే వదిలేస్తే జగన్, వైసీపీ నేతలు అబద్ధాలను పదేపదే చెప్పి ప్రజలను మోసం చేస్తారని అన్నారు. అధికారం చేపట్టగానే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టామని చెప్పిన చంద్రబాబు.. తిరుమలలో గోవింద నామస్మరణే వినపడాలని చెప్పారు. 2029 నాటికి తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తామని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెడచామని చెప్పిన చంద్రబాబు.. కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు.