KCR

జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం- కేసీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills By Poll) బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్ (BRS) సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మహమూద్‌ అలీ, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సునీతా లక్ష్మారెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ  ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తీరుతెన్నులపై డివిజన్ల ఇంచార్జీలు కేసీఆర్‌కు వివరించారు. కాంగ్రెస్‌ అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని ఈ సందర్బంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారని చెప్పిన గులాబీ బాస్.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్న సమయంలోనే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. 

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపును ఎప్పుడో ఖరారైందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఐతే అత్యధిక మెజారిటీ కోసం ప్రజలతో కలిసి పనిచేయాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. జూబ్లీహిల్స్ లో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ సర్కారు వైఫల్యాల గురించి కాంగ్రెస్‌ బాకీ కార్డు చూపిస్తూ వివరించాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేసీఆర్‌ చెప్పారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా గడవకుండానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లోని రైతులే కాదు, హైదరాబాద్‌ ప్రజలు సైతం చేతుల్లో పైసలు ఆడక పరేషాన్‌లో పడ్డారని కేసీఆర్ కామెంట్ చేశారు. రెండున్నరేళ్ల తరువాత మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అప్పటి వరకు నాయకులంతా ప్రజలతో మమేకమై వారి సమస్యల కోసం పోరాటం చేయాలని కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.
 


Comment As:

Comment (0)