దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన చంద్రబాబు
సీఎం జగన్ ను దేవుడు కూడా క్షమించడు - చంద్రబాబు
బాపట్ల రిపోర్ట్- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులను మోసం చేయడం చాలా ఈజీ అని అనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవా చేశారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తుపాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారట అని సీఎం జగన్ ను ఉద్దేశించి విమర్శించారు చంద్రబాబు. విత్తనాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం అవసరమా అని రైతులను ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ముద్దులు పెట్టడం, ఆ తరువాత పిడిగుద్దులు గుద్దడంలో, నేరాలు చేయడంలో జగన్ దిట్ట అని అన్నారు చంద్రబాబు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తుపానులు రాకముందే పంట చేతికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నామని ఈ సందర్బంగా చంద్రబాబు గుర్తు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు ఇచ్చిన ప్రభుత్వం మాదని అన్నారు. తాను కట్టాను కాబట్టే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు ఏ మాత్రం బాగా లేవని.. మురికి కాల్వలు గాలికి వదిలేశారని అన్నారు. వైసీపీ నేతలకు ఇసుకపై ఉన్న ప్రేమ రైతులపై లేదని విమర్శించారు. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రైతులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారన్న చంద్రబాబు.. రైతు బాధలను పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్ ను దేవుడు కూడా క్షమించడని అన్నారు. ఏపీలో వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేన్న చంద్రబాబు.. అప్పుడు రైతు రాజ్యం తెస్తామని భరోసా ఇచ్చారు.